బుధవారం, సెప్టెంబర్ 14, 2011

ఖర్చు తక్కువ... దిగుబడి ఎక్కువ


ఖర్చు తక్కువ... దిగుబడి ఎక్కువ
అమరావతి, న్యూస్‌లైన్: వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం పెరగడంతో వాతావరణం కలుషిమమవుతోంది. పంట భూములు నిస్సారంగా మారే ప్రమాదం ఏర్పడింది. భూమిలో సహజసిద్ధంగా ఉండే మిత్ర పురుగుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.

ఈ నేపథ్యంలో అటు మిత్ర పురుగుల్ని కాపాడుకుంటూ, ఇటు భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు గుంటూరు జిల్లా అమరావతి వ్యవసాయ పరిశోధనా స్థానం జీవన ఎరువుల్ని ఉత్పత్తి చేస్తోంది. అక్కడ రైజోబియం, అజటో బాక్టర్, అజో స్పైరిల్లమ్, ఫాస్పో బాక్టీరియా, మైకో రైజావేమ్ అనే జీవన ఎరువులు పొడి రూపంలో ఉత్పత్తి అవుతున్నాయి. జీవన ఎరువులు సాగు ఖర్చును తగ్గించడమే కాకుండా దిగుబడిని 10 నుండి 20 శాతం పెంచుతాయి. ఈ నేపథ్యంలో జీవన ఎరువుల గురించి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.త్రిమూర్తులు అందిస్తున్న వివరాలు...

రైజోబియం
కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పు జాతి పంట లు, వేరుశనగ, సోయా చిక్కుడు వంటి నూనె గింజల పంటలు వేసే వారు విత్తనాలకు రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. దీనివల్ల మొక్కల వేర్లపై లేత గులాబీ రంగు బుడిపెలు ఏర్పడతాయి. వీటిలో ఉన్న రైజోబియం గాలి లోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. వేసే పంటను బట్టి రైజోబియం కల్చర్ పరిమాణాన్ని నిర్ణయిం చాలి. ముందుగా 100మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పం చదార లేదా బెల్లం లేదా గంజి పిండిని కలిపి 10 నిమిషాల పాటు మరగబెట్టాలి. ఆ తర్వాత ఆ ద్రావణాన్ని చల్లార్చి విత్తనాలపై చల్లాలి. అనంతరం ఆ విత్తనాలకు రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. ఆ తర్వాత విత్తనాల్ని 10 నిమిషాల పాటు నీడలో ఆరబెట్టి అనంతరం విత్తుకోవాలి.

అజటో బాక్టర్
పప్పు జాతి పంటలు మినహా మిగిలిన పంటలన్నింటికీ అజటో బాక్టర్ అనే జీవన ఎరువు నత్రజనిని అందిస్తుంది. ఇది నత్రజనిని స్థిరీకరించడంతో పాటు మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లను అందిస్తుంది. దీనివల్ల భూమిలోని సేంద్రియ కర్బనం సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ జీవన ఎరువును ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటల్లో ఎక్కువగా వాడతారు. ఏ పంటకైనా కిలో కల్చర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనాలు విత్తేటప్పుడు ఎకరం విస్తీర్ణంలో చల్లుకోవాలి. ఆ సమయంలో భూమిలో తగినంత తేమ ఉండేలా చూడాలి.

అజో స్పైరిల్లమ్
ఇది మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోట వేర్లలో కూడా జీవిస్తుంది. ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని ఎక్కువ శాతం నేరుగా మొక్కకు అందుబాటులో ఉంటుంది. దీనిని పప్పు జాతి పంటలు మినహా మిగతా అన్ని పంటలకు ఉపయోగించవచ్చు. వరి, చెరకు, పత్తి, మిరప, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
తక్కువ కాలపరిమితి కలిగిన పంటలకు కిలో అజో స్పైరిల్లమ్‌ను 80-100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఎకరం పొలంలో వేయాలి. విత్తనాలు విత్తడానికి ముందే దీనిని వేసుకోవాలి. నారుమడులు పెంచి నాట్లు వేసే పైర్లకు సంబంధించి నారు పీకడానికి ముందు నారుమడి దగ్గర 70-80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఆ నీటిలో కిలో అజో స్పైరిల్లమ్‌ను వేసి బాగా కలపాలి. ఆ ద్రావణంలో మొక్కల వేర్లను పది నిమిషాల పాటు ముంచి ఆ వెంటనే మొక్కల్ని నాటుకోవాలి. చెరకు పంటకు సంబంధించి విత్తన ముచ్చెల్ని పది నిమిషాల పాటు ఈ ద్రావణంలో ముంచి ఆ తర్వాత నాటాలి.

ఫాస్ఫో బాక్టీరియా
ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. దీనిని అన్ని పంటలకూ వాడుకోవచ్చు. అయితే ఇది సమర్థవంతంగా పని చేయాలంటే సేంద్రియ కర్బనం అవసరమవుతుంది. అందువల్ల దీనితో పాటు తప్పనిసరిగా సేంద్రియ ఎరువు వాడాలి. ఫాస్ఫో బాక్టీరియా మొక్కకు హార్మోన్లను కూడా సరఫరా చేస్తుంది. మొక్కల్లో చీడపీడల్ని తట్టుకునే శక్తిని పెంచుతుంది.

1.0-1.5 కిలోల ఫాస్ఫో బాక్టీరియాను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి (ఎకరానికి సరిపోతుంది) దుక్కిలో లేదా మొక్కలు నాటేటప్పుడు సాళ్లలో వేసుకోవాలి. వరికి అయితే నాట్లు వేసిన 3-7 రోజుల్లో వేసుకోవాలి. దీనిని వేసే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి.

మైకో రైజావేమ్
ఈ జీవన ఎరువును ఏదైనా సేంద్రియ ఎరువుతో కలిపి విత్తడానికి/నాటడానికి ముందే వేయాలి. ఎకరం విస్తీర్ణానికి అయిదు కిలోల కల్చర్‌ను వాడాలి. ఇది మొక్కకు కావాల్సిన భాస్వరాన్ని సమృద్ధిగా అందిస్తుంది. అంతేకాక జింక్, మాంగనీస్, ఇనుము, రాగి, కోబాల్ట్, మాలిబ్డినమ్ వంటి సూక్ష్మ ధాతువుల్ని కూడా అందిస్తుంది. పంట నీటి ఎద్దడిని తట్టుకోవటానికి మైకోరైజావేమ్ ఉపకరిస్తుంది. నులి పురుగులు, శిలీంధ్రాల నుండి పంటకు రక్షణ కల్పిస్తుంది. భూమిలో సేంద్రియ కర్బనం పెరగడానికి దోహదపడుతుంది. దీనిని నీడ ప్రదేశంలో నిల్వ ఉంచాలి. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి.

జీవన ఎరువుల్ని రసాయన ఎరువులతో కలిపి వాడకూడదు. సేంద్రియ ఎరువుతో కలిపినట్లయితే వెంటనే వాడుకోవాలి. చౌకగా లభించే జీవన ఎరువులకు సంబంధించి మరింత సమాచారం కావాలంటే అమరావతి వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని (ఫోన్ నెం.08645255345) సంప్రదించవచ్చు.

ప్రయోజనాలెన్నో...

పంటల సాగులో సేంద్రియ, జీవన ఎరువుల వాడకం తగ్గడం వల్ల భూమిలో పంటలకు మేలు చేసే మిత్ర పురుగుల సంఖ్య కూడా బాగా తగ్గుతోంది. మొక్కకు అవసరమైన పోషకాలు, హార్మోన్లు సరిగా అందడం లేదు. ఈ పరిస్థితిని నివారించాలంటే పైర్లకు జీవన ఎరువుల్ని వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మొక్కలకు పోషక పదార్థాలను, హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయమే జీవన ఎరువు. జీవన ఎరువులు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయి. వాతావరణంలోనూ, భూమిలోనూ మొక్కలు తమంత తాముగా గ్రహించలేని పోషకాల్ని అందుబాటులోకి తెస్తాయి. నేల నుండి సంక్రమించే తెగుళ్లను కూడా కొంత మేర నివారిస్తాయి. భూసారాన్ని పెంచుతాయి. జీవన ఎరువుల వాడకం వల్ల తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. మొక్కల్లో చీడపీడల్ని తట్టుకునే శక్తిని పెంచవచ్చు. భూమిలో పురుగు మందుల అవశేషాల్ని తగ్గించవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి