శనివారం, అక్టోబర్ 01, 2011

చిగుళ్ల వ్యాధులు, దంత సమస్యలు, నోటి దుర్వాసన, నోటి సంబంధ వ్యాదులు



నవ్వు ఒక వరం. హాయిగా నవ్వేవారికి ఎలాంటి రుగ్మతలు రావు అని ఒక నమ్మకం. కానీ కొందరు వివిధ కారణాలతో హాయిగా నవ్వలేకపోతారు. ఇలా పదిమందితో నవ్వుతూ మనస్ఫూర్తిగా నోరు విప్పలేకపోవడానికి అనేక కారణాలున్నప్పటికీ ప్రధానమైనది నోటి దుర్వాసన. కొందరికి తమ నోటి నుంచి దుర్వాసన వెలువడుతున్న విషయమే తెలియదు. మరికొందరికి దుర్వాసన వస్తున్నట్లు తెలిసినా ఏం చేస్తే అది పోతుందో తెలియదు. ఈ రెండు అంశాలతో పాటు, నోటి దుర్వాసనను నివారించుకోనే మార్గాలపై అవగాహన కోసం ఈ కథనం. చదివితే… తాజా శ్వాసతో అందరూ దగ్గరవుతారు.

నోటి దుర్వాసనను వైద్యపరిభాషలో హాలిటోసిస్ అంటారు. హాలిటస్ అనే లాటిన్ పదానికి అర్థం శ్వాస. దీనితో పాటు రుగ్మతను సూచించే పదం… ఒసిన్‌ను జత చేసినప్పుడు అది హాలిటోసిస్ అవుతుంది. దంత సమస్యలకు సంబంధించినంతవరకు దంతక్షయం, చిగుళ్ల వ్యాధుల తర్వాత నోటి దుర్వాసనే అతి పెద్దదైన, ప్రధానమైన సమస్య.
పగటి వేళల్లో ఆహారం తీసుకోడానికి, నీళ్లు తాగడానికి, మాట్లాడటానికి… ఇలా అనేక కారణాలతో మనం నోటిని అనేకసార్లు తెరుస్తూ ఉంటాం. దాంతో నోటిలోకి తగిన స్థాయిలో ఆక్సిజన్ ప్రవేశిస్తూ ఉంటుంది. అయితే రాత్రివేళల్లో నిద్ర కారణంగా ఈ పరిస్థితి ఉండదు కాబట్టి నోరు చాలాసేపు మూసుకుపోయి ఉంటుంది. కాబట్టి రాత్రివేళ తగింత ఆక్సిజన్ అందక నోటిలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఉదయం నిద్రలేవగానే నోటి నుంచి వెలువడే దుర్వాసన మరింత ఎక్కువగా, ఇబ్బందికరంగా ఉంటుంది. దంతాలను శుభ్రంగా బ్రష్ చేసుకుని, నోటిని నీటితో బాగా పుక్కిలించి కడుక్కున్నప్పుడు ఈ వాసన కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొందరిలో మాత్రం ఆ దుర్వాసన దీర్ఘకాలికమైన సమస్యగా పరిణమిస్తుంటుంది.
కారణాలు:
నోటి దుర్వాసనకు కారణాలలో దాదాపు 90 శాతం నోటికి సంబంధించినవే ఉంటాయి. ఉదాహరణకు ఉల్లి, వెల్లుల్లి, మాంసం, చేపలు వంటివి తినడం, మద్యం, పొగతాగడం, స్థూలకాయం కూడా నోటి దుర్వాసనకు సంబంధించిన కారణాల్లో ఒకటి. ఇవేగాక నోరు మొదలుకొని, ఆహార నాళం వరకు అనేక సమస్యలు నోటిదుర్వాసనకు కారణమవుతుంటాయి.
నోరు:
మన నోటిలో సుమారు ఆరు వందల రకాలకు పైగా బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలో అనేక రకాలు నోటి దుర్వాసనకు కారణమవుతుంటాయి. వీటి ప్రోటీన్స్ – అమైనోయాసిడ్స్‌గా విఛిన్నమయ్యే సమయంలో దుర్వాసన వెలువడుతుంది.
నోటిలోని ఇతర భాగాలు కూడా దుర్వాసన వెలువడటానికి కారణమవుతాయి. ముఖ్యంగా చిగుళ్ల సమస్యలు, దంతాలు విరిగిపోయి ఉండటం, దంతాల మధ్య సందులు, కట్టుడుపళ్లు మొదలైనవి కూడా దుర్వాసనకు కారణం.
నాలుక:
నోటి దుర్వాసనకు కారణాలలో అతి ముఖ్యమైనది నాలుకను శుభ్రం చేసుకోకపోవడం. నాలుకపై ఉండే బ్యాక్టీరియా దుర్వాసనను, కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. నోటి దుర్వాసన కేసుల్లో అత్యధికం ఈ కోవకు చెందినవే. నాలుక కింది భాగంలో చాలా బ్యాక్టీరియా నివాసం ఉంటాయి. నాలుకలోని ఈ భాగం కొంత పొడిగా ఉండటం, నాలుక పైభాగాన్ని శుభ్రం చేసుకున్నంతగా ఈ భాగాన్ని శుభ్రం చేసుకోకపోవడంతో ఇక్కడ ఆవాసం ఉన్న బ్యాక్టీరియా అక్కడ స్థిరంగా ఉండిపోతాయి. మనం ఆహారం తీసుకున్నప్పుడు చిన్న చిన్న ఆహార పదార్థాలు ఈ బ్యాక్టీరియాకు పోషకాలుగా ఉపకరిస్తాయి. దాంతో ఇవి మరింతగా అభివృద్ధి చెందిన నోటి దుర్వాసనకు దోహదం చేస్తాయి. ఫలితంగా నోటి దుర్వాసన మరింత తీవ్రం అవుతుంది. నాలుకను శుభ్రం చేసుకుంటే దుర్వాసనను చాలామట్టుకు నివారించవచ్చు. దీనికోసం నాలుకను నాలుకబద్దతో శుభ్రం చేసుకోవడం, మౌత్‌వాష్ ఉపయోగించడం వంటివి చేయాలి.
చిగుళ్ల వ్యాధులు:
చిగుళ్ల వ్యాధులు తీవ్రమైన నోటి దుర్వాసనకు కారణమవుతాయి. చిగుళ్లు వ్యాధిగ్రస్తం కావడం, నోటిలో పుండ్లు రావడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది.
దంతాలు:
దంతాలు విరిగిపోయి ఉన్నా, పళ్ల మధ్య ఖాళీలు ఉన్నా మనం తీసుకునే ఆహారం అక్కడ చిక్కుకుపోతుంది. దాన్ని సక్రమంగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అది కుళ్లడం మొదలయి, బ్యాక్టీరియా చేరడానికి ఆస్కారం ఉంటుంది. ఫలితంగా చిగుళ్ల వ్యాధులు సోకడమే కాకుండా, దంతమూలం వరకూ దంతాలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో దంతక్షయం, ఏది నమలాలన్నా నొప్పి వంటి సమస్యలు బాధిస్తాయి. వాటితోపాటు నోటి దుర్వాసన సమస్య కూడా వస్తుంది.
కృత్రిమ దంతాలు:కృత్రిమ దంతాలు అమర్చుకున్నవారిలో నోటి దుర్వాసన తరచూ కనిపించే సమస్య. ముఖ్యంగా తీసిపెట్టుకునే కట్టుడు పళ్లు అమర్చుకున్నవారిలో ఈ సమస్య ఎక్కువ. కట్టుడు పళ్లను రాత్రివేళల్లో తీసి వైద్యలు సూచించిన విధంగా భద్రపరచుకోవడం, వాటిని ఉపయోగించే ముందు, తర్వాత శుభ్రం చేసుకుంటూ ఉండటం అవసరం.
ఇతర అవయవాలకు సంబంధించిన సమస్యలు:
శరీరంలోని ఇతర అవయవాలకు సోకే ఇన్ఫెక్షన్‌ల వల్ల కూడా నోటి దుర్వాసన రావచ్చు. ఉదాహరణకు సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల నోటి దుర్వాసన రావచ్చు. అలాగే టాన్సిల్స్ సమస్య వచ్చినప్పుడు, జీర్ణకోశంలో ఎసిడిటీ పెరిగి అక్కడి వాయువులు ఆహారనాళం నుంచి పైకి ఎగదన్నుతున్నప్పుడు (గాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ – జీఈఆర్‌డీ) నోటి నుంచి దుర్వాసన వెలువడే అవకాశాలు ఎక్కువ. అలాగే దీర్ఘకాలికంగా కాలేయం దెబ్బతిన్నప్పుడు నోటి నుంచి దుర్వాసన రావచ్చు. ఊపిరితిత్తుల సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, మధుమేహం (షుగర్) వంటి రుగ్మతలు ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన కనిపించే అవకాశాలు ఉన్నాయి.
నోటి దుర్వాసన సమస్య ఉన్న వ్యక్తికి అది తెలియకపోవచ్చు. కానీ సంభాషించేవారు దూరంగా జరుగుతుంటే దాన్ని గుర్తించి తగిన నివారణ, చికిత్స చేయించుకోవాలి.
నివారణ:
పతిరోజూ ఉదయం, రాత్రి… రెండుమార్లు పళ్లు తోముకోండి.
బషింగ్ తర్వాత టంగ్‌క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోండి. నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోవడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయండి.
చిగుళ్లపై పుళ్లు ఉన్నప్పుడు తప్పనిసరిగా డెంటిస్ట్‌ను కలిసి పరీక్షలు చేయించుకోండి.
కొన్నిసార్లు దంతాల్లో పిప్పిపళ్లు ఉన్నప్పుడు ఫిల్లింగ్ చేయించుకోవాలి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.
ఆహారం సరిగా జీర్ణం కాకుండా గ్యాస్ వస్తున్నప్పుడు, సైనస్, టాన్సిల్స్ వంటివి ఉన్నప్పుడు, మధుమేహం లాంటి వ్యాధులు ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి తగిన చికిత్స తీసుకోవాలి.
చికిత్స:

నోటి దుర్వాసనకు సరైన కారణాన్ని కనుగొని దానికి చికిత్స తీసుకోవాలి. ఉదాహరణకు దంతాలు విరిగిపోయి, ఆ సందుల మధ్య ఆహారపు ముక్కలు చేరి, అవి దుర్వాసనకు కారణమైతే డెంటిస్ట్‌ను సంప్రదించి ఫిల్లింగ్ చేయించుకోవాలి. దంతాలపై పాచి పేరుకుని గారలా మారితే బ్రషింగ్‌తో సులభంగా పోదు. దానికి దంతవైద్యులను సంప్రదించి స్కేలింగ్ వంటి చికిత్స పొందాలి. ఇక చిగుళ్ల వ్యాధులు ఉన్నప్పుడు తగిన మందులు వాడాలి. చిగుళ్ల వ్యాధులు ఉన్నప్పుడు ఇప్పుడు లేజర్ వంటి అత్యాధునిక ప్రక్రియల ద్వారా వాటికి చికిత్స చేయడానికి వీలు ఉంది. ఒకవేళ దంతమూలాలకు ఇన్ఫెక్షన్ సోకితే రూట్‌కెనాల్ వంటి చికిత్సలు, లేజర్ చికిత్సలు ఎంతగానో ఉపయోగపడతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి