సోమవారం, సెప్టెంబర్ 19, 2011

ఆనాపానసతి


ఆనాపానసతి


ఈ రోజు మనం ఆనాపానసతి గురించి మరింత సవివరంగా తెలుసుకుందాం
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీల యొక్క మూల ఆధ్యాత్మిక సాధనా సిద్ధాంతమే 'ఆనాపానసతి'
గౌతమబుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఉపయోగించిన పాళీభాష పదమే 'ఆనాపానసతి'

పాళీభాషలో
'ఆన' అంటే 'ఉచ్చ్వాస';
'అపాన' అంటే 'నిశ్వాస';
'సతి' అంటే 'కూడుకుని వుండడం'.
కనుక 'ఆనాపానసతి' అంటే "మన శ్వాసతో మనం కూడుకుని వుండడం". అంటే "శ్వాస మీద ధ్యాస" పెట్టడం.
ఈ 'ఆనాపానసతి' అన్నదే ప్రపంచానికి సకల ఋషులు, యోగులు - అందరూ కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం!
ఈ 'ఆనాపానసతి' అన్నదే పశువు ను 'పశుపతి' గా చేసే ఉన్న ఒక్కగానొక్క అద్భుత సాధనం.
"పశువు" అంటే జంతువు; "పశుపతి" అంటే జంతుత్వానికి తాను అధీనుడు కాకుండా తాను జంతువుకు 'పతి' అంటే 'యజమాని' కావడం. మనిషి ఒక జంతువు! జంతు ప్రపంచం లోని ఒకానొక 'స్పీసీస్'! ఈ 'హోమో సాపియన్స్' అన్నది మానవజాతి. ఈ జాతి 'పశుపతి' కావాలంటే దానికి మార్గమే ఆనాపానసతి. ఈ 'ఆనాపానసతి'నే నిజమైన "పాశుపతాస్త్రం" గా కూడా మనం చెప్పుకోవచ్చు.
'పశువు'ను 'పశుపతి'గా చేసే 'పాశుపతాస్త్రం' - 'ఆనాపానసతి'!
పాశుపతాస్త్రంతో సాధించలేనిదంటూ ఏదీ లేదు! అలాగే, ఆనాపానసతితో సాధించలేనిదంటూ ఏదీ లేదు.
- ఆనాపానసతి సర్వ రోగ నివారిణి.
- ఆనాపానసతి సర్వ భోగ కారిణి.
- ఆనాపానసతి సర్వ జ్ఞాన ప్రసాదిని.
కనుకనే, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారి మూల ఆధ్యాత్మిక సాధనా సిద్ధాంతం ఆనాపానసతి అయింది.
ఆధ్యాత్మిక మార్గంలో, ముఖ్యంగా, రెండు దశలు వున్నాయి. ఒకటేమో 'ఉపాసనా దశ'; రెండవదేమో 'విపస్సనా దశ'.
'ఉపాసన' అంటే అది నోట్లోంచి చేసే ప్రక్రియ; 'విపస్సన' అంటే నాసిక నుంచి మొదలై మూడవ కన్ను దగ్గరకు పోయే క్రియ.
'ఉపాసన' ను మంత్రోచ్ఛారణ ద్వారా మంత్రోపాసకులు అభ్యాసం చేస్తూ వుంటారు. మంత్రం చెప్పి చెప్పి చివరికి ఒకానొక నిశ్శబ్ద స్థితికి, మంత్ర రహిత స్థితికి చేరుకున్నప్పుడు - కొన్ని దివ్య రూపాలు కనబడతాయి. అయితే, అదంతా అంతవరకే ఆగిపోతుంది. ఆ దివ్యదృష్టి యొక్క ప్రాథమికాలలో, ప్రాథమిక దశలో సంచరించడమే ఉపాసకులు సాధించేది. అంతకన్నా పైకి పోవడం అన్నది - "సంపూర్ణ దివ్యదృష్టి" అన్నది - "ఉచ్చారణ"లో "మంత్రోపాసన"లో సాధ్యమయ్యేది ఎంత మాత్రం కాదు.
"సంపూర్ణ దివ్యదృష్టి"కి చేరుకోవాలంటే, "సంపూర్ణ విపస్సన"కు చేరుకోవాలంటే, మార్గం మంత్రోపాసన కానేకాదు! అందుకు వున్న ఒక్కగానొక్క మార్గం ఆనాపానసతి! మంత్రోపాసకులు 'ఐదవ శరీరం' అంటే 'ఐదవ చక్రం' వరకే చేరుకుంటారు; అదే 'విశుద్ధ చక్రం'. అలా చేరుకున్నవారికి 'ఆరవ చక్రం' అంటే, 'ఆజ్ఞాచక్రం' అంటే, 'సుదర్శన చక్రం' ఛాయలు మాత్రమే కనబడతాయి; అంతేకానీ అందులో పరిపక్వత సాధించలేరు.
అలాకాకుండా "మంత్రోపాసన" అనే "నోటితో చేసే క్రియ" ని వదలి పెట్టేసి "ముక్కుతో చేపట్టే క్రియ" అనే "ఆనాపానసతి"ని మొదలు పెడితే దివ్యదృష్టి అచిరకాలంలోనే సంప్రాప్తించి అద్భుతమైన దివ్యదృష్టి సంపన్నులై ఆత్మవిజ్ఞానం అపారంగా లభిస్తుంది. అప్పుడు ఏడవదైన సహస్రార స్థితికి అచిరకాలంలోనే చేరుకుంటాం. ఏడవ కోశమే నిర్వాణమయకోశం.
'ఉపాసన' ద్వారా 'దు:ఖరాహిత్యం' అన్నది ఎన్నటికీ సంభవించదు. హిందూ సాంప్రదాయంలో 'ఉపాసన' ప్రథమస్థానాన్ని ఆక్రమించింది; 'విపస్సన' బౌద్ధ సాంప్రదాయంలో ప్రథమస్థానాన్ని ఆక్రమించింది.
ప్రాచీన హిందూ సాంప్రదాయంలో కూడా యదార్థంగా ఉన్నది విపస్సనే కానీ ఉపాసన కానే కాదు. ఆ తర్వాత పరిస్థితులు క్షీణించి 'విపస్సన' నుంచి 'ఉపాసన'కు మోక్షమార్గం దిగజారిపోయింది!
'ఉప' + 'ఆసన' అంటే 'ప్రక్కనున్న ఆసనం'; రెండవ ఆసనం! చిన్న ఆసనం!
'మంత్రోచ్ఛారణ' అన్నది చిన్న ఆసనం; అది ప్రధాన ఆసనం కాదు. 'విపస్సన' అన్నది సింహాసనం! అదే ప్రధాన ఆసనం! అక్కడే మనిషి 'రారాజు' అవుతాడు; 'సింహం' అవుతాడు; 'పశుపతి' అవుతాడు.
'అనాహత' చక్రం అంటే 'మౌనం'.
ఎక్కడైతే 'అహతం' లేదో, 'ఫ్రిక్షన్' లేదో, 'చప్పుడు' లేదో అది అనాహతం!
మంత్రోచ్ఛారణ అనేది మణిపూరక చక్రం నుంచి, అంటే మూడోచక్రం నుంచి మొదలవుతుంది. అంటే గొప్ప గొప్ప మణుల్లాంటి మంత్రాలు ఉచ్ఛరించి 'మణిపూరకం' నుంచి 'అనాహతం' అనే స్థితిలో చేరి చివరికి 'విశుద్ధం' అనే చక్రంలోకి చేరుతాం - అయిదవ చక్రం మాత్రం ఉత్తేజితం అవుతుంది.
కానీ, ఆనాపానసతి అన్నది డైరెక్టుగా విశుద్ధ చక్రం నుంచి ప్రారంభమయి మరి అజ్ఞా చక్రం ద్వారా ఏడవ స్థితికి తీసుకుని వెళ్తుంది! అలా చేరుకున్నవాడే ఓ ఏడుకొండలవాడు! అక్కడికి చేరుకున్నవాళ్ళే గ్రాండ్ మాస్టర్స్!
కనుక, ఎవరైనా ఓ మాస్టర్ గా; ఓ గ్రాండ్ మాస్టర్ గా కాదల్చుకుంటే - 'గురువు', 'పరమగురువు' కాదల్చుకుంటే - వాళ్ళు ఆనాపానసతి నే చేపట్టాలి - మంత్రోపాసనను ఎంత మాత్రం కాదు!
మంత్రోపాసన ద్వారా ప్రధాన శిష్యుడుగా అవ్వొచ్చు. అంతేకానీ దాని ద్వారా మనం ప్రధాన గురువుగా మాత్రం కాలేం! ముఖ్యశిష్యుడుగా వుంటాం; ముఖ్యగురువుగా కాలేం!
ఆరవదైన అజ్ఞా చక్రానికి చేరుకున్నవారే గురువులు; ఏడవ స్థితికి అంటే సహస్రారస్థితికి - చేరుకున్నవారే పరమ గురువులు! దానికి మార్గం ఆనాపానసతే కానీ, మంత్రోపాసన కాదు.
కనుక, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వారి సిలబస్ అత్యుత్తమ సిలబస్. ఇది పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయి ఆధ్యాత్మిక సిలబస్! రీసర్చ్ చేసే సిలబస్; ఇది హైస్కూల్ ఆధ్యాత్మిక సిలబస్ కాదు; 'ప్రైమరీ స్కూలు ఆధ్యాత్మిక సిలబస్ అంతకన్నా కాదు!
ఈ పోస్టుగ్రాడ్యుయేటు కాలేజీలో ఎంట్రీ కోసం అధోలోకమైన నోట్లోంచి మొదలుపెట్టం! ఊర్థ్వలోకం అయిన నాసికలోనే మొదలు పెడతాం!
మంత్రం అధోలోకమైన నోట్లో వుంది! అనాపానసతి ఊర్థ్వలోకమైన నాసికలో వుంది! నోరు 'అడ్డం'గా వుంటుంది! నాసిక 'నిలువు'గా వుంటుంది.
కనుక, మనం 'అడ్డం'గా ఈ లోకం లోనే తిరుగుతూ వుంటాం - ఎంత ఉపాసన చేసినా! 'నిలువు'గా పైలోకాలకు దూసుకుని వెళ్ళిపోతాం - నాసికలో స్థితం అవ్వడం ద్వారా!
నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే భ్రూమధ్యం. అదే 'నాసికాగ్రం' అంటే! 'నాసికాగ్రం' అంటే 'ముక్కుకొన' కాదు. చాలా మంది 'ముక్కుకొన' అని అనుకుంటారు. 'అగ్రం' అంటే 'పైన' - కనుక భ్రూమధ్యాన్నే 'నాసికాగ్రం' అని అంటాం.
ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు ధ్యానం మొదలయింది అన్నమాట. అనాపానసతి అభ్యాసం ఎలా చేయాలంటే హాయిగా కూర్చుని, కాళ్ళు రెండూ కట్టేసుకుని, చేతులు రెండూ కట్టేసుకుని, కళ్ళు రెండూ కట్టేసుకుని, మన మస్తిష్కాన్ని కట్టేసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అలా చేసినప్పుడు ఈ శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి 'నాసికాగ్రం' లో, అంటే 'భూమధ్యంలో, అంటే 'అజ్ఞాచక్రస్థానంలో, అంటే సుదర్శనచక్రస్థానం'లో తనంతట తాను సుఖంగా స్థితం అయిపోతుంది. అప్పుడు ఆ స్థితిలో మనం 'తదేక'మై వుంటే, 'తన్మయ'మై వుంటే - 'మూడవ కన్ను' యొక్క విస్ఫోటనం మొదలవుతుంది.
ఈ మూడవ కన్ను వస్ఫోటాన్ని గమనించడాన్నే 'విపస్సన' అంటాం. 'పశ్యతి' అంటే సంస్కృతంలో 'చూడడం'; 'పస్సన' అంటే పాళీ భాషలో 'చూడడం'. 'విపస్సన' అంటే విపరీతంగా, విశేషంగా చూడడం - 'జయం', 'విజయం' - లో లాగా 'వి' అంటే విశేషమైన చూపు! అదే మూడవ కంటిచూపు - ముక్కంటి చూపు! థర్డ్ ఐ విజన్! ఇది మనకు ఆనాపానసతి ద్వారా వెంటనే లభించే కానుక; బహుమానం. బహు అద్భుతం!
కనుక, దాన్ని మనం ప్రతి రోజూ అభ్యాసం చేసి దాని ద్వారా మెల్లిమెల్లిగా ఇతర లోకాలన్నీ తెలుసుకుని ఇతర లోకాలలో సంచరిస్తూ జ్ఞాన, విజ్ఞానాల్ని సంపాదించినప్పుడు, సంపూర్ణమైన మల్టీ డైమెన్షనల్ అవగాహన వచ్చినప్పుడు, మనం సహస్రారస్థితికి చేరుకున్నట్లు!
ఈ 'విపస్సన' అంటే మామూలుగా ప్రస్తుతం ప్రచారంలో వున్న "శ్రీ గోయెంకా గారి విపస్సన మార్గం" కానే కాదు! - ఆ 'విపస్సన' ఈ విపస్సన - ఒక్కటేకాదు! మామూలుగా 'కాయ అనుపస్సన' అని ఏదైతే ఉందో దానిని 'విపస్సన' అని ఆయన అనుకుంటున్నారు - అది పూర్తిగా తప్పు.
కనుక, ఈ రోజు మూడు పదాలు - 'ఆనాపానసతి', 'కాయానుపస్సన', 'విపస్సన' - అన్న పదాలకు తేడాలను తెలుసుకుందాం! ఎక్కువమంది అనుభవజ్ఞులు కూడా కన్ఫ్యూజన్ లో పడిపోయి 'కాయానుపస్సన'నే, అంటే రెండవ స్టేజీనే, 'విపస్సన' అంటే మూడవ స్టేజిగా అర్థం చేసుకుంటున్నారు. గోయెంకా గారి మార్గంలో అందరూ సరిగ్గా ఆనాపానసతి తోనే ధ్యానాభ్యాసాన్ని మొదలుపెడ్తారు. కానీ ఆ ఆనాపానతతి ఎక్కడ అంతం అవ్వాలో వారికి తెలియదు! వారు పాపం దారి తప్పి పోతున్నారు.
ఈ ఆనాపానసతి ఎంతసేపు చెయ్యాలంటే కనీసం ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. అంటే 10 సంవత్సరాల వాళ్ళు 10 నిమిషాలు; 20 సంవత్సరాల వాళ్ళు 20 నిమిషాలు; 30 సంవత్సరాల వాళ్ళు 30 నిమిషాలు ఈ - విధంగా ధ్యానంలో కూర్చోవాలి.
ఈ విధంగా మినిమమ్ ధ్యానాభ్యాసం చేసుకోవాలి. అన్నం ఉడకడానికి కాస్సేపు సమయం పడ్తుంది కదా! ఊరికే 'అలా' పొయ్యి మీద బియ్యం పెట్టి 'ఇలా' తీసేస్తే అది ఉడకదు గదా! "మనం కూడా ఉడకాలి" అంటే ఈ ఆనాపానసతి అనే పొయ్యి మీద కాస్సేపు నిలబడి వుండాలి! "ఎంత సేపు నిలబడాలి?" అంటే వయస్సు ఎక్కువ ఉన్నప్పుడు ఆనాపానసతి అనే పొయ్యి మీద ఎక్కువ సేపు వుండాలి. తక్కువ వయస్సు వున్నప్పుడు తక్కువ సమయం సరిపోతుంది. సరిగ్గా సమయం కేటాయించినప్పుడే, అప్పుడే, పూర్తిగా ఉడుకుతాం! అప్పుడే 'విపస్సన' అనేది మనకు వస్తుంది.
ఆనాపానసతి అభ్యాసంలో ఈ భౌతిక కాయం వుడుకుతుంది; అంటే నాడీమండల శుద్ధి జరుగుతుంది. అనేకానేక ప్రాణసంచారాలు మన ప్రాణమయశరీరంలో జరగడం మనం గమనిస్తాం. ఎక్కడెక్కడ నొప్పులు వస్తుంటాయో, అక్కడక్కడ ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లు మనం గమనిస్తూ వుంటాం. దీనిని అంతటినీ "కాయఅనుపస్సన" అని గౌతమబుద్ధుడు అన్నాడు. అంటే అంతర్ శరీరంలో, నాడీ మండలంలో జరిగే మార్పులను మనం గమనిస్తూ వుండడం.
'కాయానుపస్సన'నే 'విపస్సన'గా పొరబాటు పడితే కేవలం నాడీ మండల శుద్ధే జరుగుతుంది కానీ దివ్యదర్శనాలమూ, థర్డ్ ఐ విజన్స్ కూ అక్కడ తావు వుండదు! అక్కడ ఆ తావు లేకపోయేసరికి అందరూ శరీరానుభుతుల్నే, శరీర ఆరోగ్యాన్నే పొందుతున్నారు కానీ ఆత్మవిజ్ఞానాన్ని మాత్రం పొందడం లేదు!
ఆత్మవిజ్ఞానం విపస్సన ద్వారానే వస్తుంది; కాయానుపస్సనలో ఆగిపోతే రాదు. నాడీమండలంలో 72వేల నాడులు వుంటాయి. 'నాడి' అంటే ఓ ఎనర్జీ ఛానల్. నాడులన్నీ శుద్ధం కావడాన్నే - ఆ విధంగా శుద్ధం అవుతున్నప్పుడు వచ్చే నొప్పులనూ, బాధలనూ, అనుభవాలనూ గమనించడాన్నే 'కాయానుపస్సన' అంటాం.
ఆనాపానసతి చేస్తుంటే, చేస్తుంటే, చేస్తుంటే అపారమైన ప్రాణశక్తి మన లోపల ప్రవహించి, ఆ ప్రాణశక్తి అనేకానేక నాడులను కడుగుతూ వుంటే ఆ యొక్క కదలికలను, ఆ యొక్క కడిగే రీతులను, కడగడం ద్వారా వచ్చే నొప్పులను గమనించడం అనేదే 'కాయానుపస్సన'.
కనుక ఆనాపానసతి అభ్యాసంలో, ప్రాథమికంగా ఎన్నో రోజులు ఈ విధమైన శారీరక నొప్పులను అనుభవిస్తూ వుంటాం.
అందరూ అంటూ వుంటారు - "అంతకు ముందు నాకు లేని నొప్పులు వచ్చాయండి" అవును! అంతకు ముందు 'కడగలేదు' - కనుక, అక్కడ రోగగ్రస్తమైవుంది. కానీ కడిగినప్పుడు - ఆ రోగాన్ని శుద్ధప్రాణశక్తితో 'రుద్దుతున్నాం' కనున అక్కడ నొప్పి వస్తుంది. ఆ 'రుద్దడం' వల్ల రోగాలు శాశ్వతంగా మాయమవుతాయి.
కనుక, ఈ శారీరక నొప్పులు, బాధలు అన్నవి - కాయానుపస్సనలో వచ్చే తప్పనిసరి బాధలు - ధ్యానాభ్యాసంలో లోతుకు వెళ్తేనే కానీ అవి మనకు సంభవించవు.
చాలామందికి ఇది తెలియక "ధ్యానంలో నొప్పులు వస్తున్నా" యని ధ్యానం మానేస్తూ వుంటారు! ఇది చాలా తెలివితక్కువ పని! ఆనాపానసతి మొదలు పెట్టిన తర్వాత అనేక నొప్పులు వస్తాయని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారికి తెలుసు. కనుక ఆ నొప్పులను శుభ్రంగా భరిస్తూ వుంటారు. ఈ నొప్పులు వస్తుంటాయి. వాటిని సంతోషంగా భరించాలి!
ఈ 'భరించే' శక్తినే శంకరాచార్యులవారు 'తితీక్ష' అని అన్నారు. "ఒక మనిషి ముముక్షువు కావడానికి 'షట్ సంపత్తి' వుండాలి" అని ఆయన అన్నాడు. అందులో 'సమం' - 'దమం' - 'తితీక్ష' - 'ఉపరతి' - 'శ్రద్ధ' - 'సమాధానం' - అనే ఆరింటిని ఆయన 'షట్ సంపత్తి' అన్నారు.
అందులో మూడవది తితీక్ష అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల బాధలు వస్తాయి. నాడీమండలం ఎంత అశుద్ధంగా వుంటే క్లీన్ చేసేటప్పుడు అంత ఎక్కువగా నొప్పులు వస్తూ వుంటాయి.
గత జన్మల్లో మహాయోగి అయినప్పుడు ఏ నాడీమండల శుద్ధీ అవసరం లేకుండా డైరెక్టుగా విపస్సన వస్తుంది. కనుక, గత జన్మల్లో మనం యోగం చేయకపోతే - గత జన్మల్లో ఎక్కువ పాపచరితులం అయితే - ఈ జన్మలో మనం ఆనాపాన సతి అభ్యాసం మొదలు పెట్టినప్పుడు ఎన్నో రోజులు ఆ నాడీ మండల శుద్ధిలోనే యోగ సమయాన్ని గడపాల్సి వస్తుంది. ఎన్నో గంటలు ఆ యొక్క కాయానుపస్సనలోనే - ఆ రెండో దశలోనే - తప్పనిసరిగా వుండాలి; ఎన్నో బాధలను తప్పనిసరిగా అనుభవించాలి.
కానీ, గత జన్మల్లోనే ఎంతో గొప్ప యోగ అభ్యాసి అయితే కాయానుపస్సన అన్న రెండవ దశ అసలు ఎంత మాత్రం వుండకపోవచ్చు! లేకపోతే, బహుకొద్దిగా వుండవచ్చు! లేక ఆనాపానసతి మొదలు పెడ్తూనే మూడో కన్ను తెరుచుకోవచ్చు! వెంటనే విపస్సన దశకి వెళ్ళిపోవచ్చు!
కనుక, "ఏ జన్మలో ఏం చేశాం", "ఏం చెయ్యలేదు" అన్నదానిని బట్టి ఈ జన్మలో ఈ యొక్క కాయానుపస్సన దశ 'ఎంత వుంటుంది", "ఎంత వుండదు" అని మనకు తెలుస్తుంది.
కొంతమంది అంటారు, "అదేమిటండీ, కళ్ళు మూసుకోగానే ఆనాపానసతి మొదలుపెట్టంగానే మీకు మూడో కన్ను ఎలా తెరుచుకుంటుంది? అలా మాకు ఎందుకు రాలేదు?"
మీ చరిత్ర వేరు వారి చరిత్ర వేరు! వాళ్ళు ఎన్ని జన్మలు చక్కగా యోగాభ్యాసం చేశారో? మన వర్తమానం ఎప్పుడూ మన గతం మీద ఆధారపడి వుంటుంది. కనుక, ఈ యొక్క కాయానుపస్సన, రెండవ దశ, అంటే నాడీమండల శుద్ధి అన్నది ఎన్ని రోజుల్లో, ఎన్ని వారాల్లో, ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాల్లో పూర్తి అవుతుందన్నది మన గత జన్మల చరిత్రను బట్టి వుంటుంది.
అలాగే ఈ జన్మలో ఎంత దీక్షాయుతంగా ఈ ధ్యాన అభ్యాసం చేస్తామో దాని మీద కూడా ఫలితాలు ఆధారపడి వుంటాయి. ధ్యానాభ్యాసం చాలా దీక్షగా చేస్తే 40 రోజులలో ఎవరికైనా గానీ ఈ కాయానుపస్సన, నాడీమండల శుద్ధి అన్న దశ పూర్తిగా అయిపోయి విపస్సన దశలోకి సత్వరంగా, ఖచ్చితంగా వచ్చేస్తారు. 40 రోజుల దీక్షనే 'మండల దీక్ష' అని అన్నాం.
"జీసస్ ఫాస్టెడ్ ఫర్ ఫార్టీ డేస్" అంటే, జీసస్ 40 రోజులు ఏకధాటిగా ధ్యానం చేసి అద్భుతమైన దివ్యదృష్టి సంపాదించుకుని, ఆ తర్వాత దైవపుత్రుడు అయ్యాడు.
జీససుక్రైస్ట్ లాగా దైవపుత్రులం కావాలంటే మనం కూడా ఏకధాటిగా ధ్యానం చేయాల్సిందే! 40 రోజులు ఈ మండల దీక్షలో ఆనాపానసతి ధ్యానం చేస్తే ప్రతి మనిషి కూడా తప్పకుండా 'ఓ జీసస్' అవుతాడు. కానీ, మనం 40 రోజులు ఏకధాటిగా కూర్చోం. మనకి సంసారం వుంది కనుక, ఇంకొన్ని రోజులు ఎక్కువ పడుతుంది.
ఈ విధంగా ఏకదీక్షతో ఆనాపానసతి చేయడం ద్వారా మన నాడీమండలం అంతా శుద్ధి అయి 'కాయానుపస్సన' అనే రెండవ దశ దాటి 'విపస్సన' అనే అద్భుతమైన మూడవ దశ అంటే 'దివ్యదృష్టిలోకం' లో - మనం ప్రవేశిస్తాం. అప్పుడే 'ముక్కంటులం' అవుతాం.
ఈ ఆనాపానసతి అనేది రోజుకు ఒక్కసారి అయినా నిశ్చలంగా కూర్చుని ఎవరి వయస్సు ఎంత వుందో అన్ని నిముషాలు కూర్చోవాలి. ఇతర సమయాల్లో ఓ 5 నిమిషాలు సమయం దొరికితే 5 నిముషాలుగా, 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాలుగా ఎంత సమయం దొరికితే అంతగా అభ్యాసం చెయ్యాలి. ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేసుకోకుండా వేరే పని ఏమీ లేనప్పుడు చక్కగా కళ్ళు రెండూ మూసుకొని ఎక్కడంటే అక్కడ కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టడం శుభ్రంగా అలవాటు చేసుకోవాలి.
అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు మనం ఎలాగూ పడుకుంటాం కనుక, ఆ పడుకునే మందర శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం నిద్రపోతే ఆ నిద్ర అంతా కూడా 'యోగ నిద్ర' అయిపోతుంది! అప్పుడు మనం ఈ శరీరం వదిలిపెట్టి సూక్ష్మశరీరంతో పై లోకాలకు వెళ్ళినప్పుడు యోగనిద్రలో ఎక్కువగా మనకి వాటి మీద అధిపత్యం వస్తుంది. ఆ 'కలలు' అన్న వాటిల్లో చక్కగా మనం రీసెర్చి చేసుకోవచ్చు; వాటిని మనం ఉపయోగకరంగా మలుచుకోవచ్చు. రాత్రి మనం పడుకునే, శ్వాస మీద ధ్యాస ద్వారా ఆనాపానసతి చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతే!
ఆనాపానసతి మనం అభ్యాసం చేస్తున్నప్పుడు గదిని వీలయినంత చీకటి చేసుకోవాలి. ఎంతమందితో మనం కలిసి ధ్యానం చేస్తే అంత బాగుంటుంది. అలాగే సీనియర్ మాస్టర్లతో కలిసి ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువ శక్తి వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది. చిన్నప్పటి నుంచే ఆనాపానసతి మొదలు పెట్టాలి.
ఆనాపానసతి అంటే 'సుఖప్రాణాయామం' అని కూడా మనం పతంజలి భాషలో చెప్పుకోవచ్చు. 'ప్రాణాయామం' అంటే 'హఠయోగ ప్రణయామం' అనీ 'రాజయోగ ప్రాణయామం' అనీ రెండు విధాలుగా వుంటుంది.
హఠయోగ ప్రాణాయామంలో 'కుంభకం' అనేది వుంటుంది. శ్వాస పీల్చడాన్ని 'పూరకం' అని అంటాం. శ్వాస వదలడాన్ని 'రేచకం' అని అంటాం. శ్వాస నిలపడాన్ని, బంధించడాన్ని, స్థంభింపచేయడాన్ని 'కుంభకం' అని అంటాం. రెండు రకాల కుంభకాలు వున్నాయి. అంతర్ కుంభకం, బహిర్ కుంభకం. శ్వాస పీల్చి నిలపడాన్ని "అంతర్ కుంభకం" అనీ, శ్వాస వదలిపెట్టి మళ్ళీ తీసుకోకుండా వుండడాన్ని, శ్వాస బయటే వుంచడాన్ని "బహిర్ కుంభకం" అనీ అంటాం.
అంతర్ కుంభకం అనేది హఠయోగ ప్రాణాయామంలో ప్రధానమైన అంశం. కానీ, రాజయోగ ప్రాణాయామంలో కుంభకం అన్నది తీసివేయబడుతుంది. కనుక, ఈ యొక్క 'సుఖప్రాణాయామం' కేవలం పూరకరేచకాత్మకం, కుంభక రహితం!
ఈ సుఖ ప్రాణాయామమే రాజయోగ ప్రాణాయామం - లేక పతంజలి యొక్క ప్రాణయామం; లేక బుద్ధుడి యొక్క ఆనాపానసతి! ఇదే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారి మూల ధ్యాన ఆధ్యాత్మిక సిద్ధాంతం.
సృష్టిలో మరో మూల సిద్ధాంతం ఏం చెప్తుందంటే "ప్రకృతి ఎప్పుడూ సహజంగా వుంటుంది" అని! "అది సులభరీతిలో వుంటుంది" - అని! ఏదైతే ప్రకృతి సహజంగా వుందో, సులభరీతిగా వుందో అదే సత్యమైనది" కూడా అని మనం తెలుసుకుంటాం. కనుక సత్యమూ, సహజమూ, సులభమూ - ఈ మూడూ ఒక్కటే! అసహజమైనదే అసత్యం; అసత్యమే అసహజంగా వుంటుంది; అసత్యం కష్టంగా వుంటుంది - సులభరీతిలో వుండదు.
కనుగ గుర్తుంచుకోండి - సత్యాన్ని తెలుసుకోవాలంటే అతి సులభంగా వుండేదే సత్యం; అతి కఠినంగా వుండేదే, కఠోరంగా వుండేదే అసత్యం. అతి సహజంగా వుండేదే సత్యం; అతి అసహజంగా వుండేదే అసత్యం.
కనుక, 'సహజత', 'సత్యత', 'సులభత' - ఈ మూడూ కూడా పర్యాయపదాలు. ఒకటి వుంటే మిగతా రెండూ వుంటాయి అక్కడ. కనుక, ఈ 'హఠయోగ ప్రాణాయామం' అన్నది అసహజమైనది. కుంభించడం అన్నది కఠోరమైనది. అది సత్యానికి సుదూరమైనది.
అనాపానసతేతర హఠయోగ ప్రాణయామాదులు గౌతమబుద్ధుడు ఎన్నో చేశాడు. సంవత్సరాల తరబడి చేసి వాటి యొక్క నిష్ఫలతను ఆయన స్వయంగా అనుభవించి వాటిని పూర్తిగా కాలదన్నాడు! వాటిని కాలదన్ని "పుట్టినప్పటినుంచీ ఏ విధంగా శ్వాసను గమనించాను?" అని ఆయన విచారణ చేయడం మొదలు పెట్టాడు.
"మొత్తం మీద శ్వాసలో ఎక్కడో రహస్యం వుందని తెలుసు; ఈ కఠోరసహితమైన శ్వాసను అభ్యాసం చేసి వాటి నిష్ఫలతను అనుభవించాను గదా? ఇప్పుడు వాటిని దూరం చేసి సహజమైన శ్వాసనే గమనిస్తే?" - ఈ విధంగా ఆయన ఆలోచనా ధోరణి నడిచింది!
ఎప్పుడైతే అసహజమైన శ్వాసరీతులను మనం తీసివేస్తామో, అప్పుడే సహజమైన శ్వాసరీతి అక్కడ మిగిలిపోతుంది.
"ఏమిటి సహజమైన శ్వాసరీతి?" అని ఆయన కనుక్కుని "చిన్నప్పటినుండి ఎలాగైతే శ్వాసను గమనిస్తున్నానో అదే సరియైనది" అనుకుని ఈ ఆనాపానసతి అభ్యాసాన్నే ఆయన మొదలుపెట్టాడు.
కనుక గౌతమబుద్ధుడు అసహజ ప్రాణాయామరీతులనన్నింటినీ తీసేసి 'సహజమైన ప్రాణాయామం' అంటే 'కుంభకరహిత ప్రాణాయామం' - అదే ఆనాపానసతి - అన్న అద్భుతమైన విధానాన్ని స్వయంగా కనుక్కున్నాడు! కనుకనే బౌద్ధం అంత అద్భుతమైన సత్యమార్గం!
ఒకసారి ఒకాయన గౌతమబుద్ధుడితో అన్నాడు - "స్వామీ! ఈ ప్రపంచంలో మీ అంతటివాడు గతం లోను లేడు; ఇప్పుడూ ఎక్కడా లేడు! మీ తర్వాత కూడా మీ అంతటి వారు ఇంకెవ్వరూ రారు అని నేను అనుకుంటున్నాను!" ఆయన గౌతమబుద్ధునితో అలా అన్నప్పుడు ఆ మహాత్ముడు, ఆ పరమాత్ముడు ఏమన్నాడంటే "ఓరీ! పిచ్చివాడా! నా లాంటి బుద్ధుళ్ళు నాకన్నా ముందు కొన్ని లక్షలమంది వున్నారు! నా తర్వాత కూడా కొన్ని లక్షలమంది వస్తున్నారు! నీకేమైనా దివ్యచక్షువు వుందా! నువ్వు గతం తెలియకుండా, భవిష్యత్ తెలియకుండా, ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావు! అలా ఎప్పుడూ సత్యం తెలియకుండా మాట్లాడకు! నా మీద మూర్ఖ అభిమానం కొద్దీ ఇలాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నావు! నాలాంటి బుద్ధుళ్ళు ఎంతో మంది వున్నారు గతంలో మరి ఎంతో మంది వస్తారు భవిష్యత్తులో!" అని అద్భుతంగా శెలవిచ్చారు. అంటే అర్థం ఏమిటి? గౌతమబుద్ధుడి లాగానే అనాపానసతి విధానాన్ని కనుక్కున్న వాళ్ళు కోకొల్లలుగా అంతకు ముందూ వున్నారు! ఆ తర్వాత కూడా వున్నారు, వుంటారు!
సహజంగానే ప్రతి ఒక్కళ్ళూ సత్యాన్ని కనుక్కోవాలి అన్నప్పుడు చివరగా చేరే స్థితే ఆనాపానసతి - చివరిగా కనుక్కునే ఉపాయమే ఆనాపానసతి!
-- ఇంకా వుంది --

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి