బుధవారం, సెప్టెంబర్ 14, 2011

M TRANSFER

ఎం ట్రాన్స్‌ఫర్స్‌తో మొబైల్ ఫోన్లే మనీపర్స్‌లు (Mobile phone becomes money purse with M-Transfers)

రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న పలు చర్యలతో ఇప్పుడు మన మొబైల్ ఫోనే మనీ పర్సుగా మారిపోతున్నది. బ్యాంకులు గతంలోనే ఖాతాదారులకు మొబైల్ ద్వారా నగదు వివరాలు, నగదు వ్యవహారాల సమాచారం ఇచ్చేవి. ఇప్పుడు మొబైల్ సేవలు మరింత విస్తృతమవుతున్నాయి. ఇక కొత్త చెక్‌బుక్ కావాలన్నా, చెల్లింపులు ఆపడం, డిమాండ్ డ్రాఫ్ట్ పొందడం, బీమా ప్రీమియం చెల్లింపు, మొబైల్ రీఛార్జింగ్ లాంటి పనులన్నీ ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు. తరచుగా ప్రయాణాలు చేసేవారు మరో అడుగు ముందుకేసి బస్, రైలు, విమానం టిక్కెట్లను కూడా మొబైల్ ఫోన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశముంది. అలాగే సినిమా ప్రియులు ఈ టిక్కెట్లు కూడా మొబైల్ ఫోన్ ద్వారా పొందవచ్చు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇప్పటికే చాలామందికి అందుబాటులో ఉన్నప్పటికీ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే కంప్యూటర్, ఇంటర్నెట్ తప్పనిసరి. మనదేశంలో ప్రస్తుతం కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవారికంటే మొబైల్ ఫోన్లు ఉన్నవారి సంఖ్యే ఎక్కువ. ఇప్పుడొస్తున్న అత్యాధునిక మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్‌ను కూడా ఉపయోగించుకునే సౌకర్యం ఉండటంతో ఎక్కువమంది కంప్యూటర్‌కు బదులు అరచేతిలో ఇమిడే మొబైల్ ఫోన్ ద్వారా కార్యకలాపాలవైపే మొగ్గుచూపుతున్నారు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉన్నా వాటిని క్లోనింగ్ చేసి యజమానుల్ని మోసగించడం, షాపుల్లోనూ జరిగే మోసాలతో ఈ కార్డులున్నవారు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ బ్యాంకింగ్ ఒక రకంగా మేలనే చెప్పుకోవాలి.

మొబైల్ ఫోన్ ద్వారా నగదు లావాదేవీల విషయానికి వస్తే గతంలో అయితే నగదు బదిలీకి గరిష్ఠంగా 5 వేల రూపాయలు, ఒక రోజు షాపింగ్‌కు గరిష్ఠంగా 10 వేలరూపాయలు పరిమితి ఉండేది. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ పరిమితులను సడలించి మరింత ఎక్కువ మొత్తాల్లో మొబైల్ ద్వారా నగదు వ్యవహారాలకు అవకాశమిచ్చింది. ఈ పరిమితులు ఆయా బ్యాంకుల మధ్య మారే అవకాశం కూడా ఉంది. M-Transfers చేసుకోవడానికి దాదాపు 32 బ్యాంక్‌లకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఉంది. తాజా పరిణామాల మధ్య భవిష్యత్తులో నగదు రహిత కార్యకలాపాల్ని (Cashless Transactions) ను మొబైల్ ఫోన్లే శాసిస్తాయనేది కాదనలేని సత్యం.
M-Transfers కోసం Gprs మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న జావా ఆధారిత మొబైల్ ఫోన్లను ఉపయోగించాలి. మీరు ఏ బ్యాంక్ నుంచి మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ వెబ్‌సైట్ నుంచి మొబైల్ బ్యాంకింగ్ దరఖాస్తు లేదా M-Banking అప్లికేషన్‌ను మీ మొబైల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ అధికార్లను సంప్రదిస్తే ఈ విధివిధానాలు మరింత స్పష్టంగా తెలుస్తాయి. ఈ కనెక్షన్లు, లావాదేవీల్లో ఏవేవి ఉచితం, వేటికి డబ్బుకట్టాలో ముందే తెలుసుకోండి.
అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది మొబైల్ బ్యాంకింగ్ PIN (పాస్‌వర్డ్ లాంటి రహస్య సంఖ్య). దీనిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇతరులకు తెలియనివ్వద్దు. మొబైల్ పోతే సిమ్‌ను బ్లాక్ చేయించాలి. మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ లేదా మీకు ఖాతా ఉన్న బ్యాంక్‌లు అనుసరిస్తున్న విధి విధానాల్ని, నిబంధనల్ని, మార్పు చేర్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే దీని నుంచి మీరు అత్యధిక ప్రయోజనాలు పొందగలుగుతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి