బుధవారం, సెప్టెంబర్ 14, 2011

SOCIAL NETWORK SITES

వాణిజ్య వారధులుగా సోషల్ నెట్‌వర్క్ సైట్లు

ఫేస్‌బుక్‌తో పాటు వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు ఇప్పుడు వ్యాపార సంస్థలకు మెరుగైన వ్యాపారావకాశాలు, మానవ వనరులు అందించే వారధిగా మారుతున్నాయి.

ఇలాంటి సైట్‌లు వివిధ వ్యాపార, పారిశ్రామిక సంస్థల్లో ఉత్పాదకతను తగ్గిస్తున్నాయని, మోసపూరితమైన సమాచారం ఇచ్చి ఉద్యోగాలు సంపాదించే వారి గుట్టు రట్టు చేస్తున్నాయని కొద్ది రోజుల క్రితం వెలువడిన వార్తలకు భిన్నమైన కోణాన్ని మాన్‌పవర్ ఇన్‌కార్పొరేటెడ్ ఆవిష్కరించింది.

ఇంటర్నెట్ అనుసంధానం కొత్త పుంతలు తొక్కడంతో సమాజంలోని భిన్నవర్గాలు, వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలకు వారధిగా ఆర్కుట్, హాయ్ 5, ఫ్లికర్, లింక్‌డ్ ఇన్, ట్విటర్ వంటి పలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు రంగంలోకి వచ్చాయి.

ఈ సైట్‌లు వాణిజ్య సంస్థలకు అనుసంధానక్తలుగా మారి ఆయా సంస్థల వ్యాపార విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది వేశాయని మాన్‌పవర్ చైర్మన్ జెఫ్ జోరిస్ అంటున్నారు.

ఇంతవరకు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు నిర్వహించి మానవ వనరులను నియమించుకున్న కంపెనీలు ఈ క్రమంలో మరుగున పడిపోయిన నిపుణుల సేవలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల సహకారంతో వర్చువల్ వర్క్‌ఫోర్స్‌గా వినియోగించుకుంటున్నాయి.

దీని వల్ల సుదూర ప్రాంతాల్లోని నిపుణుల సేవలు కూడా ఆయా సంస్థలకు అందుబాటులోకి వస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం సర్వీసులో ఉన్న వారందరూ వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి నిపుణుల సేవలు ఆయా కంపెనీలకు విలువైన వనరుగా మారుతున్నాయి.

ఇలాంటి సైట్‌ల ద్వారా దూర ప్రాంతాల్లో ఉంటున్న ఉద్యోగులుతమ సిఇఒతో నేరుగా అనుసంధానమై తమకు వచ్చిన ఐడియాలను సరికొత్త విధానంలో వారికి తెలియచేసి మన్ననలు పొందతున్నారని జోరిస్ అన్నారు.

అలాగే వారు ఆయా కంపెనీల బ్రాండ్ ప్రచారకర్తలుగా కూడా మారుతున్నారని ఆయన తెలిపారు. అయితే ఈ కంపెనీ పరిశోధనలో పాల్గొన్న సంస్థల్లో 75 శాతం కంపెనీలు సోషల్ నెట్‌వర్క్ సైట్‌లను మానవ వనరులకు, వ్యాపారాభివృద్ధికి వారధిగా ఉపయోగించుకునే విషయంలో నిర్దిష్ట విధానం ఏదీ లేదని తెలిపాయి.

ఈ సైట్‌లు కంపెనీల వ్యాపారాభివృద్ధికి కూడా దోహదపడుతున్నాయన్న కొత్త ఆవిష్కరణ వచ్చిన నేపథ్యంలో వివిధ కంపెనీలు ఈ సైట్‌లను వారధులుగా ఉపయోగించుకునే విషయంలో విధానాలను రూపొందించుకోవడం కూడా అవశ్యం అన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి