మంగళవారం, సెప్టెంబర్ 13, 2011

INDIAN KANOON WEBSITE

న్యాయవ్యవస్థకూ ఒక గూగుల్ http://indiankanoon.org/

అది సమాజానికి నాలుగు మూల స్తంభాల్లో ఒకటి. కానీ, చాలామందికి ఓ పెద్ద పజిల్‌. అలాంటి చిక్కుముడిని విప్పాలనుకున్నాడతడు. ఒక్కడే అహరహం శ్రమించి… ఆ పజిల్‌ను దాదాపుగా సాధించాడు.

1.‘హత్య’కు సంబంధించి భారత శిక్షాస్మృతి (IPC)లో ఎన్ని సెక్షన్లున్నాయి?
2.సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కపాడియా సభ్యులుగా ఉన్న ధర్మాసనాల వివరాలన్నీ ఎలా తెలుసుకోవాలి?
3.తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని బాధితురాలు సంఘటనాస్థలిలోనే హత్య చేస్తే ఏ శిక్ష పడొచ్చు?
వీటి గురించి ఆలోచించడానికే కష్టంగా ఉంది కదూ!
ఎందుకంటే… న్యాయ నిపుణులకు తప్ప మరొకరికి అంతుపట్టని అంశాలివి.
ఇవేకాదు… న్యాయవ్యవస్థకు సంబంధించిన విషయాలేవీ మిగతావాళ్లకు అంత సులభంగా అర్థం కావు. పేరుకు న్యాయవ్యవస్థ మూడో మూల స్తంభమేగానీ ఆ స్తంభం సమీపంలోకి ఎవరు రావాలన్నా స్వతంత్రించి రాలేరు. లాయర్ల ఆసరా తీసుకోవాల్సిందే. ఎక్కడ ఏం లొసుగులు ఉంటాయో, ఏ సెక్షన్లో ఏ మెలిక ఉంటుందో ఎవరికి తెలుసు!
చట్టాలు చాంతాడంత ఉంటాయి. తీర్పులు సంక్లిష్టంగా ఉంటాయి. ఈ సమస్యను కొంతమేరకు పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం, న్యాయవ్యవస్థ చాలా ప్రయత్నించాయి. చట్టాలూ, వాటి సవరణల వివరాలకోసం indiacode.nic.in నూ, కోర్టు తీర్పుల కోసం judis.nic.in నూ ఏర్పాటుచేశాయి. అయితే ఈ రెండూ చూసినా మనకు కావాల్సింది దొరకడం కష్టమే.
అందరిలాగే జంషెడ్‌పూర్‌కి చెందిన సుశాంత్‌సిన్హాకూ ఇవేవీ అర్థం కాలేదు. సెక్షన్లేంటి, ఏ నేరానికి ఏ శిక్ష పడొచ్చు… వెుదలైన ప్రాథమిక విషయాలు తెలుసుకోవడానికి అతడు సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టుల వెబ్‌సైట్లన్నీ వెదికాడు. సమాచారం అరకొరగానే దొరికింది. అయితే అది తెలుసుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. సుశాంత్‌ విసిగిపోయాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన తనకే ఇంత ఇబ్బందిగా ఉంటే సామాన్యుల సంగతేంటి అనిపించింది అతడికి. అందరికీ సులువుగా ఆ సమాచారాన్ని అందించగలిగేలా ఓ వెబ్‌సైట్‌ ఏర్పాటుచేస్తే బాగుంటుందనిపించింది. అలా జనవరి 4, 2008న ‘ఇండియా కానూన్‌’ (http://indiankanoon.org/) ప్రారంభమైంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి